Karthika Deepam 2 November 4th: దీపకి కూతురి ప్లేస్ ఇచ్చిన సుమిత్ర - దశరథ.. బాంబు పేల్చిన శివన్నారాయణ
Photo Courtesy: JioHotstar
కన్నతల్లిలా నాకు ప్రేమను పంచిన అత్త రుణం తీర్చుకోలేనని అంటాడు కార్తీక్. ఆ తర్వాత దశరథ- సుమిత్రలతో దండలు మార్పించి, కేక్ కట్ చేయిస్తాడు. దశరథ, సుమిత్రలు భార్యాభర్తల గొప్పదనం గురించి చెబుతారు. నన్ను, నా భార్యను కలిపినందుకు మీ ఇద్దరికి ఏమైనా ఇస్తానని చెబుతాడు దశరథ. ఆ మాటలతో రగిలిపోయిన జ్యోత్స్న.. ముందు అత్తయ్య, మావయ్యలని కలపమని అంటుంది. నేను, నా భార్య కలిసే ఉన్నామని శ్రీధర్ మండిపడతాడు. శివన్నారాయణ, కార్తీక్‌లు కూడా ఆమెకు గడ్డి పెడతారు.
అందరూ భోజనానికి వెళ్లగా.. జ్యోత్స్నతో విడిగా మాట్లాడుతుంది సుమిత్ర. నీ కోసం నేను ఎంతో కుమిలిపోయానని.. దీనంతటికీ కారణం దీపేనని అంటుంది జ్యోత్స్న. బోర్డ్ మీటింగ్ తర్వాత ఇంట్లో జరిగిన గొడవ వల్లే నేను వెళ్లిపోయానని, నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయేటప్పుడు కనీసం ఆపాలని కూడా నువ్వు చూడలేదని సుమిత్ర చెప్పడంతో జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. ఎవరు నా వాళ్లో? ఎవరు పరాయి వాళ్లో? నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుందని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి నవంబర్ 4వ తేదీ 506వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదని తెలిసేరోజు దగ్గరలోనే ఉందని అంటుంది పారిజాతం. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అప్పుడు బిడ్డల్ని మార్చింది నేనే కాబట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేయడమో లేదా కేసు పెట్టి మూయించడమో చేస్తారు. నిన్ను అయితే ఏం చేస్తారో కూడా తెలియదని అంటుంది పారిజాతం. అందుకని దాసు గాడిని పిలిచి నీ కూతురిని నువ్వు తీసుకెళ్లు అంటారు అని చెబుతుంది. ఆ మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది. అప్పుడు నీకు ఈ ఆస్తికి ఏ సంబంధం ఉండదని.. సుమిత్ర కూతురు బతికే ఉందని దాసు గాడు చెప్పింది నిజమే అయితే నువ్వు వారసురాలివి కాదని బయటపడిన తర్వాత.. దాసు గాడు అందరికీ చెప్పేస్తాడు కదా అంటుంది పారు.
అప్పుడు అసలైన యువరాణి కోసం వేట మొదలవుతుందని, మన ఖర్మ కాలి అది దొరికిందే అనుకో, ఆస్తి మొత్తం దానికి.. వంట గదిలో మిగిలిపోయిన పాత బొచ్చెలు మనకీ. అప్పుడు నువ్వు ఉద్యోగం కోసం తిరుగుతూ ఉండాలని హెచ్చరిస్తుంది. దాసుగాడి దగ్గర నాలుగు జుబ్బాలు తప్పించి డబ్బులు లేవని పారు అనడంతో జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. నా మాట విని వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటే కొంతైనా సేవ్ అవుతావని చెబుతుంది. అయినప్పటికీ జ్యోత్స్న పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.
దశరథ, సుమిత్రలు కలిసి భోజనం చేస్తుండటంతో అందరూ సంతోషిస్తారు. ఇంతలో పారిజాతం వచ్చి శివన్నారాయణ పక్కనే కూర్చొంటానని అనగా.. వెళ్లిపోమంటూ పెద్దాయన కసురుకుంటాడు. నిన్నటి వరకు ఇల్లు ఎలా ఉందో అందరికీ తెలుసని, కడుపు నిండా తినడానికి కూడా లేదని చెబుతాడు. కార్తీక్, దీపలను కూడా కలిసి భోజనం చేయమని చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న మాత్రమే ఒంటరిగా మిగిలిపోయిందని, ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దామని అంటుంది పారిజాతం. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామని అంటాడు శివన్నారాయణ.
ఇంతలో దీపని సుమిత్రకి, నాకు మధ్యలో కూర్చోమని దశరథ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. నీ కూతురు దీప కాదు జ్యోత్స్న అని పారు చెబుతుంది. తను నా భార్యను కాపాడిందని, ఈ మూడు రోజులు దీప తన కన్నతల్లికి చేసినట్లే సేవలు చేసిందని కాంచన చెప్పిందని.. అలాంటి మనిషికి థ్యాంక్స్ చెబితే చాలదని అంటాడు దశరథ. మా ప్రతి పెళ్లి రోజుకు మా ఇంటికి ఒక అతిథిని పిలిచేవాళ్లమని ఈ ఏడాది నువ్వే మా అతిథివి అని అంటాడు దశరథ. తొందరలోనే నిజాలు తెలిసిపోయేలా ఉన్నాయని జ్యోత్స్న భయంతో వణికిపోతుంది.
బావ కొద్దికొద్దిగా దీపను ఈ ఫ్యామిలీకి దగ్గర చేస్తున్నాడు, ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. ఇంతలో జ్యోత్స్న చేతిపై వేడి వేడి సాంబారు పోస్తుంది పారిజాతం. నువ్వు ఈరోజు డైటింగ్ చేయాలి కదా అని అంటాడు కార్తీక్. ఈ ఒక్కరోజుకు నువ్వు ఏం తిన్నా పర్లేదని చెబుతాడు. ఆ మాటలతో స్పీడుగా లాగించేస్తుంది పారు. దీపకి దగ్గు రావడంతో సుమిత్ర, దశరథలు దగ్గరుండి నీళ్లు తాగిస్తారు. నిన్ను నేను ఎలా చూడాలనుకున్నానో అలా చూశానని, ఇక ఆలస్యం చేయకూడదని తొందరలోనే దీపే అసలైన కూతురని చెప్పాలని అనుకుంటాడు కార్తీక్. దశరథ, సుమిత్రలు ఒక్కరోజుకే ఇలా మారిపోయారేంటీ? బావ ఏం చెప్పాడని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న.
శ్రీధర్ బయల్దేరుతుండగా.. నీకు అత్తయ్య ఇంట్లో చోటు లేకపోయినా, మా ఇంట్లో చోటు ఉంటుందని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు పుట్టకముందే ఆయన ఈ ఇంటి అల్లుడు.. అప్పుడు ఇక్కడే ఉండేవాళ్లని, ఒకే కుటుంబంగా కలిసున్నాం, మూడు కుటుంబాలుగా ముక్కలైన రోజులు వచ్చాయని కానీ మన బంధాలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని చెబుతాడు దశరథ. అందరికోసం బట్టలు తీసుకొచ్చి ఇస్తాడు శివన్నారాయణ. ఆ దేవుడు నాకు చెల్లిని, తల్లిని ఒక్కరిలోనే ఇచ్చాడని కాంచనను చూసి మురిసిపోతాడు దశరథ. మరో జన్మంటూ ఉంటే ఇవే బంధాలతో ఇలాగే పుట్టాలని అంటుంది కాంచన. అప్పుడు కూడా సుమిత్ర వదినే.. నా వదిన అని చెబుతుంది. దాంతో నేను ఇంట్లోంచి వెళ్లిపోయి మీ అందరినీ ఎంతో బాధపెట్టానని సారీ చెబుతుంది సుమిత్ర.
అదంతా మేం ఎప్పుడో మరిచిపోయాం, అప్పులు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగిందని గతాన్ని తవ్వుకుంటూ పాత గాయానికి మందు వేయాల్సిన అవసరం లేదని చెబుతాడు కార్తీక్. పాత గాయాలకు ఆపరేషన్స్ కూడా జరిగిపోయావని అంటాడు. ప్రతి ఇంటికి నీలాంటి మనవడు ఒకడుండాలని శివన్నారాయణ అనగా.. ముసలోడు మళ్లీ మొదలుపెట్టాడని రగిలిపోతుంది జ్యోత్స్న. నేను ఎన్ని తప్పులు చేసినా క్షమించి నాకు చోటు ఇచ్చారని శివన్నారాయణతో అంటాడు శ్రీధర్. పెట్టే చేయి మీదే, కొట్టే చేయి మీదే.. మీరు నాకు తండ్రి లాంటి వారని శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీపలకు బట్టలు పెడతాడు శివన్నారాయణ. దాంతో తాత ఆశీర్వాదం తీసుకుంటారు భార్యాభర్తలు. పిల్లాపాపలతో ఉండమని శివన్నారాయణ ఆశీర్వదించగా.. ఒక్కతే కదా కూతురు, పిల్లాపాపలు అంటారేంటీ అని అడుగుతుంది పారిజాతం.
నాన్న దీవెన ఫలించి నువ్వు అనుకున్నదే జరగొచ్చని అంటాడు దశరథ. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. అతి త్వరలోనే ఈ ఇంట్లో ఒక పెద్ద పార్టీ జరుగుతుందని, అందరూ తరలి రావాలని చెబుతాడు.. నీ ఫ్యామిలీకి కూడా చెప్పమని అంటాడు శివన్నారాయణ. అందరం ఇక్కడే ఉన్నాం కదా అని శ్రీధర్ అనగా.. నేను చెప్పేది పెద్ద కుటుంబం గురించి కాదు, చిన్న కుటుంబం గురించి అంటాడు శివన్నారాయణ. కావేరి గురించి అని పారి చెబుతుండగా.. నేను చెప్పింది అందరికీ అర్ధమైందని కసురుకుంటాడు పెద్దాయన. దాసు, కాశీ, స్వప్నను కూడా రమ్మని చెబుతాడు శివన్నారాయణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











