Karthika Deepam 2 Weekly: శ్రీధర్‌కి షాకిచ్చిన కార్తీక్ బాబు .. జ్యోత్స్నకి శివన్నారాయణ డెడ్‌లైన్
Karthika Deepam 2 Serial Weekly Roundup: కార్తీక దీపం 2 సీరియల్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రస్తుతం మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 475 నుంచి 480 ఎపిసోడ్స్ వరకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..
సెప్టెంబర్ 29వ తేదీ 475వఎపిసోడ్ లో..
శివన్నారాయణ ఇంట్లో పరిస్ధితుల గురించి దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటూ ఉండగా పారు, జ్యోత్స్నలు వచ్చి వింటారు. మనం బయటికి వెళ్లాలి కారు తీయమని కార్తీక్‌ను తమతో పాటు శ్రీధర్ ఇంటికి తీసుకెళ్తారు. కాశీకి ఉద్యోగం చూస్తానని జ్యోత్స్న చెప్పడంతో శ్రీధర్ రగిలిపోతాడు. బయట మా డ్రైవర్ ఉన్నాడు.. నా ఫోన్, పర్స్ తీసుకుని రమ్మని చెప్పమని స్వప్నతో అంటుంది జ్యోత్స్న. స్వప్న బయటికి వెళ్లి చూడగా కార్తీక్ ఉండటంతో షాక్ అవుతుంది.. అన్నయ్య నువ్వు ఇక్కడ ఉన్నావేంటీ అని బాధపడుతుంది. నిన్ను డ్రైవర్‌ని చేసి నాతోనే నిన్ను డ్రైవర్ అని పిలిపిస్తుందా అని జ్యోత్స్నకి గడ్డి పెడుతుంది స్వప్న. కాశీకి ఉద్యోగం, డబ్బులు ఇస్తానని జ్యోత్స్న చెప్పడంతో మా అల్లుడి సంగతి మేం చూసుకుంటామని శ్రీధర్ ఆమెను పంపేస్తాడు. రాత్రి నుంచి ఏం తినకపోవడంతో దీప కళ్లు తిరిగి కిచెన్‌లో కిందపడిపోతుంది. అది గమనించిన సుమిత్ర.. ఆమెను నీళ్లు చల్లి లేపి వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేస్తుంది.
సెప్టెంబర్ 30వ తేదీ 476వ ఎపిసోడ్‌లో..
కళ్లు తిరిగి పడిపోయిన దీపకు సపర్యలు చేసి మామూలు మనిషిని చేస్తుంది. రాత్రి నుంచి ఏం తినలేదని అందుకే కళ్లు తిరిగి పడిపోయానని చెప్పడంతో దీపకు సుమిత్ర భోజనం పెడుతుంది. నీకు ప్లేట్‌లో భోజనం మాత్రమే పెట్టగలను కానీ, నా చేత్తో తినిపించలేనని నానామాటలు అంటుంది సుమిత్ర. ఒకప్పుడు దీపలో ప్రేమ, మానవత్వం ఉండేవని.. కానీ ఇప్పుడు స్వార్ధం వచ్చిందని, మా ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం లేదని మాటలతోనే వేధిస్తుంది. కత్తుల్లాంటి సుమిత్ర మాటలతో దీప కంటతడి పెడుతుంది. దీపను తిడుతూనే కర్రీ వేసుకోమని, పెరుగు వేసుకోమని చెబుతుంది సుమిత్ర. దీపకు ఎక్కిళ్లు రావడంతో సుమిత్ర స్వయంగా మంచినీళ్లు తీసుకొచ్చి తాగిస్తుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, జ్యోత్స్న, పారులు వీరిద్దరినీ చూసి షాక్ అవుతారు. సుమిత్ర, దీపలు మళ్లీ దగ్గరవుతుండటంతో వారిని ఎలాగైనా విడదీయాలని పారు, జ్యోత్స్నలు ప్లాన్ చేస్తారు. కాంచన ఇంటికి సరుకులతో పాటు డబ్బులు తీసుకెళ్లి ఇస్తాడు శ్రీధర్. అవేవీ నాకేమీ వద్దని వెళ్లిపొమ్మని మండిపడుతుంది కాంచన.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 1వ తేదీ 477వ ఎపిసోడ్‌లో..
శ్రీధర్ ఇచ్చిన సరుకుల్ని వెనక్కి తీసుకెళ్లిపోమ్మని కాంచన కోప్పడుతుంది. దాంతో ఆమెకు కొంత డబ్బులు ఇచ్చి ఇవి నీ దగ్గర పెట్టుకుని అవసరానికి వాడుకోమని చెబుతాడు శ్రీధర్. అప్పుగా ఇచ్చానని అనుకుని, నీ దగ్గర ఉన్నప్పుడు నాకు తిరిగి ఇచ్చేయమంటాడు. భర్త మాటలతో ఆలోచనలో పడ్డ కాంచన ఆ డబ్బును తన చీర కొంగులో దాచేస్తుంది. శ్రీధర్ తీసుకొచ్చిన సరుకుల్ని వెనక్కి తీసుకెళ్లిపోమంటాడు కార్తీక్. నేను నా పిల్లల కోసం ఏం చేయకూడదా? అని తండ్రి బాధపడటంతో వాటిని ఇప్పటికీ తీసుకుంటున్నానని, ఇకపై ఇలాంటి చేయొద్దని మందలిస్తాడు కార్తీక్. దీపకి సుమిత్ర అత్త భోజనం పెట్టిందని కార్తీక్ చెప్పడంతో కాంచన, అనసూయ, శ్రీధర్‌లు షాక్ అవుతారు. దశరథను భోజనం చేయడానికి పిలుస్తుంది జ్యోత్స్న. ఇంతలో శివన్నారాయణ వచ్చి మీ అమ్మనాన్నల్ని ఇంకా విడదీస్తావా? అంటూ జ్యోత్స్నపై సీరియస్ అవుతాడు. నా కొడుక్కి నేను ఏం చేయలేకపోతున్నానని శ్రీధర్ బాధపడగా కావేరి ఓదారుస్తుంది. ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వస్తాడు శ్రీధర్. కార్తీక్‌కి నీకు మధ్య జరిగిన ఒప్పందం బ్రేక్ చేయాలంటే ఏం చేయాలని జ్యోత్స్నని అడుగుతాడు.
అక్టోబర్ 2వ వ తేదీ 478వ ఎపిసోడ్‌లో..
అగ్రిమెంట్ రూల్స్ ప్రకారం ఒప్పందం నుంచి బావని రిలీవ్ చేయాలంటే 10 కోట్ల కట్టాలని చెబుతుంది జ్యోత్స్న. దాంతో వెంటనే 10 కోట్ల రూపాయలు చెక్ రాసి ఇచ్చేస్తాడు. ఇంతలో కార్తీక్, దీప వచ్చి శ్రీధర్‌ని చూసి షాక్ అవుతారు. నా చేతుల్లో ఏం లేదని ఈ విషయంలో బావదే ఫైనల్ డెసిషన్ అని చెబుతుంది జ్యోత్స్. ఈ చెక్ ఇచ్చి నువ్వు అగ్రిమెంట్ నుంచి బయటికి వచ్చేయమని కొడుకుతో చెబుతాడు శ్రీధర్. దాంతో కార్తీక్ మరో మాట లేకుండా చెక్‌ని తండ్రి చేతుల్లోనే పెట్టి వెళ్లిపోమంటాడు. కార్తీక్ ఎక్కడ తన అగ్రిమెంట్‌ని రద్దు చేస్తాడోనని భయపడ్డ పారు, జ్యోత్స్నలు ఊపిరి పీల్చుకుంటారు. అసలు కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకోవాలని దీపని నిలదీస్తాడు శ్రీధర్. నష్టాల్లో ఉన్న మన కంపెనీని బయటికి తీసుకురావడానికి నీకిచ్చిన సమయం అయిపోతోందని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. తాను వేలం పాటలో ఓ రెస్టారెంట్‌ని కొనబోతున్నానని తన ప్లాన్ అందరికీ చెబుతుంది జ్యోత్స్న. దానికి కార్తీక్ సపోర్ట్ చేయడంతో జ్యోత్స్న, పారులు సంతోషిస్తారు.

Photo Courtesy: JioHotstar
అక్టోబర్ 3వ తేదీ 479వ ఎపిసోడ్‌లో..
నా నిర్ణయాన్ని ఒప్పుకుంటావని నేను అనుకోలేదని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. కంపెనీ నష్టాల్లో ఉందని మా తాత పరువు పోతే నా పరువు పోయినట్లేనని అందుకే నీకు సపోర్ట్ చేశానని చెబుతాడు కార్తీక్. అయినా నా కోపం దీప మీద తప్పించి నువ్వంటే నాకు చాలా ఇష్టమని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. దీప మీద పగలు, ప్రతీకారాలు మానేసి కంపెనీని నష్టాల్లోంచి ఎలా బయటికి తీసుకురావొచ్చు అనేది ఆలోచించమని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. కార్తీక్ ఆత్మాభిమానం గురించి శ్రీధర్ మాట్లాడుతుండగా అది తన గురించేనని బాధపడ్డ కాశీ భోజనం మధ్యలో నుంచి లేస్తాడు. దాంతో శ్రీధర్ తన అల్లుడికి క్లాస్ పీకుతాడు. అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం నీకు ఇష్టం లేదా అని కార్తీక్‌ను కాంచన నిలదీస్తుంది. ఇంతలో శ్రీధర్ వచ్చి కొడుకుని బలవంతంగా బయటికి లాక్కెళ్లి నిజం చెప్పమని నిలదీస్తాడు. దీపం రుణం ఇంకా తీరలేదని.. అందుకే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టానని కార్తీక్ చెప్పడంతో శ్రీధర్‌కి ఏం అర్ధం కాదు. దాంతో నేనే ఆ నిజం తెలుసుకుంటానని అంటాడు శ్రీధర్.
అక్టోబర్ 4వ తేదీ 480వ ఎపిసోడ్‌లో..
ఉదయాన్నే శివన్నారాయణ, దశరథలు రెడీ అయి జ్యోత్స్న దగ్గరికి వస్తారు. వేలం పాటకి వెళ్తుండటంతో తల్లి ఆశీర్వాదం తీసుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ రాకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జ్యోత్స్న అనుకోగా.. ఇంతలో కార్తీక్, దీపలు అక్కడికి వస్తారు. మనతో పాటు ఎంతో అనుభవం ఉన్న కార్తీక్ కూడా వేలం పాటకు వస్తాడని శివన్నారాయణ చెప్పి మనవడిని తీసుకెళ్తాడు. వేలం పాట దగ్గర దశరథకు శత్రువైన వైరా ఎదురుపడతాడు. నువ్వు చేసిన మోసాన్ని ఈ జన్మలో మరిచిపోలేనని అంటాడు దశరథ. వారు లోపలికి వెళ్లగానే జ్యోత్స్నని కలుస్తాడు వైరా. నష్టాల్లో ఉన్న మీ కంపెనీని నేనే కొంటానని చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. వేలం పాట నుంచి కార్తీక్, శివన్నారాయణ, దశరథలను బయటికి పంపేలా కుట్ర చేస్తుంది జ్యోత్స్న. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











