‘మేజర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మహేశ్: విడుదల పైనా క్లారిటీ ఇచ్చేశారు
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. కెరీర్ ఆరంభంలో పవన్ కల్యాణ్ 'పంజా', రవితేజ 'బలుపు' వంటి సినిమాల్లో విలన్‌గా నటించి మెప్పించిన అతడు.. హీరోగా మారిన తర్వాత దూసుకుపోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేస్తూ తనలోని విలక్షణ నటనను బయట పెడుతున్నాడు. ఫలితంగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం 'మేజర్'. శేష్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఆ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.
ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్'. శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా లుక్ టెస్ట్ వీడియోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా 'మేజర్' ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈ పోస్టర్‌లో హీరో అడవి శేష్ గన్ పట్టుకుని కనిపిస్తున్నాడు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాతల్లో ఒకడైన సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశాడు. 'మేజర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నందుకు గర్విస్తున్నా. హ్యాపీ బర్త్‌డే అడవి శేష్. ఈ సినిమాలో నీ నటన మరోసారి ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా. నువ్వు ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా' అంటూ అందులో పేర్కొన్నాడు. ఈ పోస్టర్‌లోనే సినిమాను 2021 వేసవిలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











