Vijay Devarakonda : హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి సమీపంలో విజయ్ కారును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడగా కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. దాంతో విజయ్ మరో కారులో గద్వాల్ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. హీరో డ్రైవర్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వయంకృషితో ఎదిగిన విజయ్ దేవరకొండ
కాగా.. స్వయంకృషి, తన ప్రతిభతో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. తనదైన నటన, స్టైల్, యాక్షన్‌తో యువతలో ప్రత్యేకంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు విజయ్. 2011లో నువ్విలా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆయనకు ఏవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, ద్వారక సినిమాలు లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ దశలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో విజయ్ దేవరకొండకు మాస్ ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయారు విజయ్.
అర్జున్ రెడ్డితో రౌడీ బాయ్‌గా
ఈ సినిమా తర్వాతి నుంచి ఆయనను రౌడీ బాయ్, రౌడీ స్టార్ అని కుర్రాళ్లు పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత గీతా గోవిందంతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్నారు. టాక్సీవాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమ్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ, కింగ్డమ్ సినిమాలలో విజయ్ నటించారు. నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా, పుష్పక విమానం తదితర సినిమాలను నిర్మించారు.
రష్మిక మందన్నతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్
ఇక గీతా గోవిందం సినిమాలో తనకు జోడీగా నటించిన రష్మిక మందన్నతో ఆయన ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ సీక్రెట్‌గా పార్టీలకు, ఫంక్షన్‌లకు, వెకేషన్స్‌క వెళ్తూ పలుమార్లు మీడియా కంటికి చిక్కారు. కానీ విజయ్, రష్మిక ఇద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని మాత్రం బయటపెట్టలేదు. ఇటీవల కింగ్డమ్ మూవీని సీక్రెట్‌గా చూసి షాకిచ్చారు రష్మిక. ఈ క్రమంలో ఈ జంట సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చింది. హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో అక్టోబర్ 3వ తేదీన విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల పెద్ధలు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్, రష్మికల పెళ్లి జరగనున్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే నిశ్చితార్ధం విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో విజయ్ కనిపించడంతో అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు.
సత్యసాయి సమాధిని దర్శించుకున్న విజయ్
రష్మిక మందన్నతో నిశ్చితార్ధం నేపథ్యంలో విజయ్ దేవరకొండ అక్టోబర్ 5వ తేదీన సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఆయన వెంట తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఉన్నారు. విజయ్, ఆనంద్ ఇద్దరూ అనంతపురంలోని శ్రీ సత్యసాయి బాబా హయ్యర్ సెకండరీ స్కూల్‌లోనే చదువుకున్నారు. తాజాగా రష్మికతో కొత్త జీవితం ప్రారంభించనున్న నేపథ్యంలో సత్యసాయి మహాసమాధిని కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. అనంతరం పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











