39 ఏళ్ల క్రితం రజనీ, హృతిక్ కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? కూలీతో వార్ 2 బాక్సాఫీస్ ఫైట్
సినిమా హీరోల మధ్య పోటీ ఉండటం ఇండస్ట్రీలో అత్యంత సహజమే. తప్పనిసరి పరిస్థితుల్లో బాక్సాఫీస్ వద్ద యుద్దానికి చాలాసార్లు తెరలేవడం, దానికి ప్రేక్షకులు సాక్ష్యంగా నిలువడం చూస్తూనే ఉంటాం. తాజాగా భారతీయ సినిమా పరిశ్రమలో దక్షిణాది నుంచి రజనీకాంత్, ఉత్తరాది సినీ పరిశ్రమ నుంచి హృతిక్ రోషన్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భీకరపోటీకి తెరలేపడం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే అంశంగా మారింది. అయితే సీనియర్ సూపర్ స్టార్ రజనీకాంత్, హృతిక్ కలిసి నటించిన ఓ సినిమా గురించిన ప్రస్తావన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఆ సినిమా ఏంటనే విషయంలోకి వెళితే..
ఇండిపెండెన్స్ డే సందర్భంగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలీ, ఆయన్ ముఖర్జీ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్‌కు తెరలేపడమే కాకుండా కలెక్షన్ల పరంగా రికార్డు స్థాయి పోటీకి సిద్దపడ్డాయి. ఈ క్రమంలో స్టార్ హీరోలిద్దరూ కలిసి నటించిన ఓ సినిమా ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది.

భారతీయ సినిమా రంగంలో రజనీకాంత్ అప్పడప్పడే స్టార్ హీరోగా ఎదుగుతూ.. తమిళం, తెలుగు, కన్నడంతోపాటు హిందీ సినిమా రంగంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో 1986 సంవత్సరంలో భగవాన్ దాదా అనే మాఫియా కథతో రూపొందిన ఈ సినిమాలో రజనీ నటించారు. ఆ సినిమాను జే ఓం ప్రకాశ్ దర్శకత్వం వహిస్తే.. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రేక్షకులకు అందించారు.
రాకేష్ రోషన్, శ్రీదేవి, టినా మునిమ్, పరేశ్ రావల్, డానీ డెన్‌జాంగ్‌పా నటించిన ఈ చిత్రంలో రజనీకాంత్.. భగవాన్ దాదా అనే టైటిల్‌తో హీరోగా నటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ బాలనటుడిగా కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హృతిక్ అనాథగా మారితే.. అతడి పెంపకం బాధ్యతను భగవాన్ దాదా పాత్రతో రజనీకాంత్ తీసుకొంటారు. ఈ చిత్రంలో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ దత్తత సోదరుడిగా రజనీకాంత్ నటించారు. ఈ సినిమాకు అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీగా రెస్పాన్స్ కూడా వచ్చింది.

భగవాన్ దాదా సినిమా కథ విషయానికి వస్తే.. పల్లెటూరికి చెందిన భగవాన్ దాదా (రజనీకాంత్) బతుకు తెరువు కోసం పట్నంకు వస్తాడు. అప్పటికే నగరంలో మాఫియా డాన్‌గా పేరున్న శంభూ దాదా గ్రూపులో భగవాన్ దాదా చేరుతాడు. అయితే చేసేది నేర ప్రపంచంలో పని అయినా.. మహిళలపై లైంగిక దాడులు చేస్తే భగవాన్ దాదాకు అసలు ఇష్టం ఉండదు. ఆ క్రమంలో శాంతి (దీపిక చికిలియా రామాయణం సీరియల్‌లో సీత) ఉరేసుకొని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతుంది. దాంతో ఆమె కొడుకు గోవింద అనాథగా మారితే భగవాన్ దాదా దత్తత తీసుకొంటాడు. కాల పరిస్థితులు భగవాన్‌ను భగవాన్ దాదా ఎలా మారాడు? గోవింద తల్లి మరణానికి కారణం ఏమిటి? గోవింద్ కాస్త గోవింద్ దాదాగా ఎలా మారాడు? అనే ప్రశ్నలకు సమాధానమే భగవాన్ దాదా సినిమా కథ.
హిందీ సినిమా రంగంలో దాదాపు 39 సంవత్సరాల క్రితం కలిసి నటించిన రజనీకాంత్, హృతిక్ రోషన్ ప్రస్తుతం ఒకే రోజున రెండు భారీ సినిమాలతో పోటీ పడ్డారు. తలైవా నటుడిగా ఎదిగి.. భారతీయ సినిమా పరిశ్రమలో లెజెండరీ యాక్టర్ అయితే.. హృతిక్ హిందీలో సూపర్ స్టార్ అయ్యారు. ఈ ఇద్దరి సినిమాలు ఒక దానితో మరొకటి పోటీ పడటంతో వారు కలిసి నటించిన చిత్రంలోని ఓ ఫోటో నెటిజన్ షేర్ చేయగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. నాలుగు దశాబ్దాల క్రితం మెమొరీని మరోసారి గుర్తు చేసింది.


Click it and Unblock the Notifications











