War 2 VFXపై దారుణంగా ట్రోలింగ్.. ఎన్టీఆర్‌ని అలా చూపిస్తారా? ఫ్యాన్స్ ఫైర్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా గతంలో వచ్చిన వార్‌కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా వార్ 2ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. వార్ 2లో హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా.. అశుతోష్ రాణా, అనిల్ కపూర్‌లు కీలకపాత్రలు పోషించారు.
వార్ 2 బడ్జెట్ ఎంత?
వార్ 2 చిత్రానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ 2కు సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయం అయ్యిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

200 కోట్ల క్లబ్‌లోకి వార్ 2
తొలి రోజు బాక్సాఫీస్ వద్ద 85 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా .. రెండో రోజున 80 కోట్ల రూపాయలు, మూడో రోజున 45 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా 3 రోజుల్లో వార్ 2 వరల్డ్ వైడ్‌గా 210 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఓవర్సీస్‌లోనూ వార్ 2 స్ట్రాంగ్ హోల్డ్ సాధిస్తోంది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ఓవర్సీస్‌లో 50 కోట్ల రూపాయల వరకు వసూళ్లు సాధించింది.
ఎన్టీఆర్ రోల్‌పై విమర్శలు
సినిమా హిట్ కావడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. అయితే వార్ 2పై అభిమానులు, క్రిటిక్స్ రకరకాల రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రోల్‌పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. వార్ 2 ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఈ స్థాయిలో హైప్ రావడంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో వార్ 2కి భారీ కలెక్షన్స్ రావడంలోనూ ఎన్టీఆర్‌ది కీలకపాత్ర. ఎన్టీఆర్‌కు సరైన రోల్ పడలేదని, హృతిక్ రోషన్ ముందు తేలిపోయాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ రేంజ్‌కు సరైన పాత్ర పడలేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రే అయినప్పటికీ.. హృతిక్ రోషన్ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్‌ను డామినేట్ చేసేశాడని మండిపడుతున్నారు.
అభిమానులను మెప్పించని వీఎఫ్ఎక్స్
అటు వార్ 2 వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై నెట్టింట దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్‌లో ఆయన సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించే సీన్‌పై సెటైర్లు వేస్తున్నారు. సినిమాలో బక్కగా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఈ సీన్‌లో కాస్త ఒళ్లు చేసినట్లుగా బొద్దుగా ఉన్నారు. ఎవరో బాడీకి ఎన్టీఆర్ ఫేస్ అతికించినట్లుగా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మా హీరోను ఇలా చూపిస్తారా అంటూ తారక్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇదొక్కటే కాదు.. మూవీ స్టార్టింగ్‌లో తోడేలుతో హృతిక్ రోషన్ నడిచొచ్చే సీన్‌పైనా గ్రాఫిక్స్ వర్క్ ఏమాత్రం బాలేదని అంటున్నారు. సెకండాఫ్‌లో హృతిక్ రోషన్‌ను ఎన్టీఆర్ సముద్రంలో ఛేజ్ చేసే సీన్స్‌లో వీక్ సీజీఐ వర్క్ కనిపిస్తోంది. మితిమీరిన వీఎఫ్ఎక్స్, ఓవర్ ది టాప్ యాక్షన్ అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











