Chiranjeevi: 'మెగాస్టార్' ట్యాగ్ ఎవరూ వాడొద్దు.. చిరంజీవికి కోర్టు రక్షణ
పద్మవిభూషణ్, మెగాస్టార్, డాక్టర్ కొణిదెల చిరంజీవి ( Chiranjeevi)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో అగ్రహీరోగా కొనసాగుతోన్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఎలాంటి ఫీల్మీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ గా ఎదిగారు. ప్రస్తుతం మెగాస్టార్ గా తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఊరట కల్పించింది. మెగాస్టార్ కు రక్షణ కల్పించింది. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్రమంత్రి కొణిదెల చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పుతో పెద్ద ఊరట లభించింది. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఇతరులు తన పేరు, బిరుదులు, ఫోటోలు, వాయిస్, వీడియోలను ఉపయోగిస్తున్నారనీ, అలాంటి ఆన్‌లైన్ గార్మెంట్ సంస్థలు, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్ములు, యూట్యూబ్ ఛానెళ్లు, ఇతర కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి ఈ ఉత్తర్వులు మంజూరు చేస్తూ.. చిరంజీవి వ్యక్తిత్వ (Personality)హక్కులు, ప్రచార (Publicity) హక్కులను రక్షించేలా ఆదేశాలు ఇచ్చారు. చిరంజీవి పేరు, ఫోటోలు, బిరుదులు ('మెగాస్టార్', 'చిరు'), వాయిస్ లేదా ఆయనకు సంబంధించిన ఏ అంశాన్నైనా ఆయన అనుమతి లేకుండా ఉపయోగించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
చిరంజీవి తన పిటిషన్‌లో పేర్కొన్నదేమిటంటే.. ఇటీవల కొన్ని ఆన్‌లైన్ సంస్థలు, దుస్తుల బ్రాండ్లు, డిజిటల్ మీడియా కంపెనీలు ఆయన అనుమతి లేకుండా తన ఫోటోలు, వాయిస్, పేర్లను ఉపయోగిస్తూ ఉత్పత్తులు ప్రమోట్ చేస్తున్నాయని, దీని వల్ల తన ప్రతిష్ఠ దెబ్బతినడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతున్నానని తెలిపారు. ఈ చర్యలు అనధికారిక వాణిజ్య దోపిడీకి (unauthorized commercial exploitation)దారితీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి వంటి ప్రముఖుల ప్రతిష్ఠ నష్టం కలిగించే అవకాశం ఉందని, అందువల్ల ఇలాంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది. ఇలా ఈ తీర్పుతో చిరంజీవికి న్యాయపరంగా పెద్ద విజయం లభించింది. సినీ పరిశ్రమలో ప్రముఖుల వ్యక్తిత్వ హక్కుల రక్షణ గురించి కొనసాగుతున్న చర్చకు ఈ తీర్పు కొత్త మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత కొన్నేళ్లుగా భారతీయ సినీ ప్రముఖులు తమ పేరు, రూపం, వాయిస్, ఫోటోల వినియోగం పై జాగ్రత్తగా ఉండటం ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అరిజిత్ సింగ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్, అక్కినేని నాగార్జున వంటి అనేకమంది ఇప్పటికే తమ పర్సనాలిటీ రైట్స్‌ను రక్షించుకునేందుకు కోర్టులను ఆశ్రయించారు. ఈ జాబితాలో తాజాగా చిరంజీవి కూడా చేరారు.
సినీ విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఇది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో "సెలెబ్రిటీల హక్కుల రక్షణ"దిశగా ఒక కీలక ముందడుగు. మొత్తంగా, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు చిరంజీవి మాత్రమే కాకుండా మొత్తం సినీ పరిశ్రమలోని ప్రముఖులకు కూడా చట్టపరమైన స్పష్టతను ఇచ్చిందని న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











