Chiranjeevi: ఇకపై చిరంజీవి అనుమతి తప్పనిసరి..
టాలీవుడ్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి (Chiranjeevi)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో అగ్రహీరోగా కొనసాగుతోన్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోగా మార్చారు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ గా ఏలేస్తున్నారు. అయితే.. తాజాగా చిరంజీవి తన వ్యక్తిత్వ, ప్రచార హక్కులపై విషయంలో విజయం సాధించారు. అసలేం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులపై రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను మంజూరు చేసింది. ఉత్తర్వుల ప్రకారం.. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి పేరు, ఫోటోలు, వాయిస్, బిరుదులు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని పేర్కొంది.

చిరంజీవి తరఫున న్యాయవాదుల వాదనల ప్రకారం.. ఇటీవల పలు కంపెనీలు, మీడియా ప్లాట్‌ఫార్ములు, సోషల్ మీడియా ఖాతాలు చిరంజీవి పేరు, ఫొటోలు, AI టెక్నాలజీతో తయారు చేసిన మార్ఫ్ వీడియోలు, పోస్టర్లు మొదలైనవి చేస్తున్నారు. అయితే.. చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ఈ చర్యలు చిరంజీవి ప్రతిష్ఠకు నష్టం కలిగించడమే కాక, ఆయన వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకూ దారితీస్తున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సిటీ సివిల్ కోర్టు, చిరంజీవి వ్యక్తిత్వానికి చట్టబద్ధ రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రకారం.. చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ వంటి మెగాస్టార్, చిరు, అన్నయ్య వంటి బిరుదులను కూడా అనుమతి లేకుండా వాడకూడదు. చిరు స్వరం, ఫోటోలు లేదా ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం పూర్తిగా నిషేధించబడింది.
కోర్టు పేర్కొన్నది ఏమిటంటే.. డిజిటల్, AI వేదికల ద్వారా జరిగే వాణిజ్య దోపిడీ, తప్పుడు ప్రచారం వల్ల చిరంజీవికి అపరిమిత నష్టం జరిగే అవకాశం ఉందని, అందుకే, టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ ఈ ఉత్తర్వులను పాటించాల్సిందేనని హెచ్చరించింది. TRPs పెంచుకోవడం, వీక్షణలను లేదా లాభాలను పొందడం వంటి ఉద్దేశాలతో చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్, లేదా ఇతర వ్యక్తిత్వ లక్షణాలను అనధికారికంగా వాడితే, చట్టపరమైన చర్యలు తప్పవని కోర్టు స్పష్టం చేసింది.
చిరంజీవి తరఫు న్యాయవాదులు ఈ ఉత్తర్వులను "వ్యక్తిత్వ రక్షణలో మైలురాయి"గా అభివర్ణించారు. నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన చిరంజీవి, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో గౌరవించబడ్డారు. ఆయన పేరు, ఇమేజ్ చలనచిత్ర రంగానికి మాత్రమే కాకుండా ప్రజల మనసుల్లో ఒక సాంస్కృతిక ప్రతీకగా నిలిచాయని పేర్కొన్నారు.
ఇటీవల AI ఆధారిత మార్ఫింగ్ టెక్నాలజీ వలన ప్రముఖుల పేర్లు, ఫొటోలు, వీడియోలు తప్పుడు రూపంలో సృష్టించి ప్రచారం చేయడం పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇచ్చిన ఉత్తర్వు సినీ రంగంలో "డిజిటల్ యుగంలో వ్యక్తిత్వ హక్కుల రక్షణకు మార్గదర్శకం"గా పరిగణించబడుతోంది.
చిరంజీవి ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన తన న్యాయవాది ఎస్. నాగేశ్ రెడ్డి, లీగల్ టీమ్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసిన కోర్టు, ఈ కాలంలో ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి పేరు లేదా చిత్రాన్ని అనుమతి లేకుండా వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది కోర్టు.


Click it and Unblock the Notifications











