మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం... భారత మహిళా జట్టుకు వెంకటేష్, రాజమౌళి, సెలబ్రిటీల అభినందనలు
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అత్యంత బలమైన ఆస్ట్రేలియాపై టీమిండియా మహిళ జట్టు విజయం సాధించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 339 పరుగుల భారీ టార్గెట్‌ను భారత అమ్మాయిలు అద్భుతంగా పోరాడి ఛేదించారు. జెమీమా రోడ్రిగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌తో భారత జట్టును ఫైనల్‌కు చేర్చారు. అంచనాలను తలకిందులు చేస్తూ టీమిండియా ప్రదర్శన చేయడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత మహిళల జట్టును అభినందిస్తూ సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లీచ్‌ఫీల్డ్ 119, ఎలిస్ పెర్రీ 77, బెత్ మూనీ 24, అష్లీ గార్డ్‌నర్ 63 పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రీచరణి 2, దీప్తి శర్మ 2, అమన్‌జ్యోతి, రాధలు తలో వికెట్ పడగొట్టారు. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ షెఫాలీ (10) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. ఈ దశలో స్మృతీ మందాన, జెమీమా రోడ్రిగ్స్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు.

వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న దశలో స్మృతిని (24) గార్త్ ఔట్ చేసింది. దాంతో హర్మన్ ప్రీత్ కౌర్ (89), జెమీమా (127) లు ఇన్నింగ్స్‌ని గాడిలో పెట్టారు. ఇద్దరు స్ట్రైక్ రోటేట్ చేస్తూ వీలున్నప్పుడల్లా బౌండరీలు బాదారు. వీరిద్దరూ దాదాపు 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయానికి పునాదులు వేశారు. ఈ దశలో హర్మన్ ప్రీత్ ఔటైనా దీప్తి శర్మ (24), రిచా ఘోష్ (26), అమన్ జ్యోత్‌లతో (15) కలిసి జెమీమా జట్టును విజయ తీరాలకు చేర్చింది. చివరికి 48.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత జట్టు సంచలన విజయం సాధించి మూడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టంది. అంతేకాదు.. మహిళల వన్డే చరిత్రలోనే ఇది అత్యధిక ఛేదనగా రికార్డుల్లోకెక్కింది.
ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాపై విజయం సాధించడంతో భారత్ ఇక కప్‌ను గెలిచినట్లేనని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ చిరస్మరణీయ విజయంతో భారత మహిళ జట్టు సభ్యులు, అభిమానులు భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా జెమీమా తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్ని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. మరోవైపు.. భారత మహిళా జట్టు విజయం పట్ల పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలియజేశారు.
టీమిండియా.. అద్భుతమైన ప్రదర్శనతో ఇరగదీసింది. సెమీఫైనల్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించడం చిన్న విషయం కాదు. జెమీమా, హర్మన్ ప్రీత్, రీచా, దీప్తిలు గొప్ప ప్రదర్శన చేశారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇదే జోష్‌తో ట్రోఫీని తీసుకురావాలని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశారు.
టీమిండియా మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు.. చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఛేజ్ చేయలేని స్కోరును ఛేదించి దేశం గర్వపడేలా చేశారు. ఫైనల్‌లో చరిత్ర సృష్టించండి అని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు.
కలలు కనండి, మిమ్మల్ని మీరు నమ్మండి, సాధించండి. నిజమైన ఛాంపియన్లు ఎలా ఉంటారో మన అమ్మాయిలు ప్రపంచానికి చాటి చెప్పారు. చరిత్ర సృష్టించి టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టిందని సినీనటుడు సోనూసూద్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











