యాంకర్ శ్యామల.. నీ బతుకు బూడిదే.. మందిని ముంచేసి అంటూ కిర్రాక్ ఆర్పీ శాపనార్థాలు
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను ఈసారి గద్దె దించాల్సిందేనని గట్టిగా ఫిక్స్ అయిన ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఎన్నికలను ఎదుర్కొన్నాయి. ఏపీలో ఎన్నికలంటే సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పైగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్నికల బరిలో నిలవడంతో పాటు స్వతహాగా సినీ కుటుంబానికి చెందిన టీడీపీ ఒకే కూటమిలో ఉండటంతో పెద్ద ఎత్తున నటీనటులు ప్రచారం చేశారు. ఇరుపక్షాల వైపు పలువురు సినీ నటులు ప్రచారం చేశారు. ఈ క్రమంలో కూటమి తరపున జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పీ, వైసీపీ తరపున యాంకర్ శ్యామల ప్రచారం చేశారు.
చంద్రబాబు, పవన్‌లపై వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లతో పాటు కూటమి పెద్దలపై యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుంట నక్క, తోడేలు కథతో ఆమె జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయగా.. టీడీపీ, జనసేన కేడర్ శ్యామలపై విరుచుకుపడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శ్యామల సైలెంట్ అయ్యింది. తనకు అవకాశాలు కూడా రావడం లేదని, తనను బ్రతకనీయాలంటూ శ్యామల ఓ వీడియోను రిలీజ్ చేసింది. అయితే ఆమె సేవలను గుర్తించిన వైఎస్ జగన్.. శ్యామలను వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా నియమించారు.

టీడీపీకి కిర్రాక్ ఆర్పీ మద్ధతు
అటు జబర్దస్త్ ద్వారా జనంలో పాపులరైన కిర్రాక్ ఆర్పీ.. నాటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్ధతుగా ప్రచారం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పెద్దలపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇచ్చేవారు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజాపై సెటైర్లు వేస్తూ పంచ్‌ల వర్షం కురిపించేవారు ఆర్పీ. ఎన్నికల తర్వాత కూడా కొన్నిరోజులు ఆర్పీ నిత్యం మీడియాకు ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసేవాడు. తనపై ఎన్నో బెదిరింపులు వచ్చినా, దాడులు జరిగినా, తన వ్యాపారాలు మూయించాలని చూసినా తాను భయపడనని ఆర్పీ తేల్చిచెప్పాడు.
వైసీపీలో శ్యామలకు పదవి
ఇక వైసీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి యాంకర్ శ్యామల జనంలో ఉంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో ఏ చిన్న సమస్య వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటు ప్రభుత్వ పెద్దలపై విరుచుకుపడుతోంది. తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని యాంకర్ శ్యామల ఆరోపించింది. జగన్ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించిందని ఇది రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డ్ అని శ్యామల వ్యాఖ్యానించింది. కానీ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు పావులు కదుపుతోందని.. వీళ్లను ఏమనాలో అర్ధం కావడం లేదని ధ్వజమెత్తింది.
వైసీపీలో నీ బతుకు బూడిదే
తాజాగా యాంకర్ శ్యామల వ్యాఖ్యలపై కిర్రాక్ ఆర్పీ స్పందించారు. ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఘాటుగా బదులిచ్చారు. చేతిలో కర్పూరం వెలిగించుకుని మందిని ముంచావ్.. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశావ్.. ఇదిగో హారతి, ఎంతోమందిని పైకి పంపావ్.. ఇదిగో హారతి.. శ్యామల ఇదిగో హారతి. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీలో నీ భవిష్యత్త్ బూడిదే.. ఆఖరికి నీ వెలుతురు ఆగిపోతుందంటూ ఆర్పీ శాపనార్ధాలు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై యాంకర్ శ్యామల ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











