‘బాహుబలి అయినా.. కె ర్యాంప్ అయినా ఒకేలా చూడాలి’:‘కె-ర్యాంప్’ప్రొడ్యూసర్ ఆవేదన..
K-RAMP Movie: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కె ర్యాంప్ (K-RAMP). రొమాంటింక్ యూత్ ఫుల్ అండ్ కామెడీ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాని కొత్త దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించారు. యుక్తి తెరేజా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను నిర్మాత రాజేష్ దండ(Rajesh Danda)ప్రొడ్యూస్ చేశారు. నేడు(అక్టోబర్ 18న) విడుదల పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలపై వస్తున్న నెగిటివ్ రివ్యూలపై నిర్మాత రాజేశ్ దండా (Rajesh Danda)సంచలన వ్యాఖ్యలు చేశారు. కె-ర్యాంప్'సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నా, సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ రివ్యూలపై నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కె-ర్యాంప్' సక్సెస్ ప్రెస్ మీట్‌లో రాజేశ్ దండా మాట్లాడుతూ రివ్యూ వ్యవస్థలో పార్శియాలిటీ పెరిగిపోతోందని, కొందరు ఉద్దేశపూర్వకంగా చిన్న సినిమాలపై నెగటివ్ ప్రమోషన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. "ఇటీవల సోషల్ మీడియాలో ఒక సినిమా బాగున్నా కూడా నెగటివ్ రివ్యూలు, తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారు. కొంతమంది పనికట్టుకొని మరీ ఇది చేస్తున్నారు. దీనివల్ల చాలా సినిమాలు ప్రభావితమవుతున్నాయి" అని రాజేశ్ దండా అభిప్రాయపడ్డారు.

'అందరికీ వినోదం పంచడం కోసం తీసిన సినిమానే 'కె- ర్యాంప్'. కథలో లాజిక్స్ వెతకడం కాదు. ఇవాళ ఉదయం లేచేసరికి ట్విట్టర్‌లో రివ్యూలు, రేటింగ్స్ చూసి నిరాశ చెందాను. ఈ సినిమా విషయంలో నేను అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తా. కానీ పక్షపాత రివ్యూలు ఇవ్వడం సరికాదు. ఎవరైనా తమ అభిప్రాయాన్ని చెప్పవచ్చు, కానీ ఒకే రోజు విడుదలైన సినిమాలపై వేరే వేరే తీరులో స్పందించడం బాధాకరం. కొన్ని సినిమాలకు ఫస్ట్ హాఫ్ రివ్యూ వెంటనే ఇస్తారు, సెకండ్ హాఫ్ రివ్యూ మాత్రం గంటల తరబడి ఆపి పెడతారు. ఇంకొన్ని ప్రాజెక్టులకు రివ్యూలు ముందుగానే ఇస్తారు కానీ రేటింగ్ మాత్రం ఆలస్యంగా నిర్ణయిస్తారు. ఈ వ్యవస్థలో ఎందుకు ఇంత పక్షపాతం'అని ప్రశ్నించారు రాజేశ్ దండా.
అంతేకాకుండా, చిన్న నిర్మాతలను తక్కువగా అంచనా వేయడం తగదని స్పష్టం చేశారు. ''చిన్న నిర్మాత ఏం చేసినా భరిస్తాడని అనుకుంటారా? ఇది నాతో పాటు ఎంతోమంది నిర్మాతల సమస్య. 'బాహుబలి' అయినా 'కె- ర్యాంప్' అయినా సినిమా ఒకటే. ప్రేక్షకుడు టికెట్ కొనుగోలు చేసి థియేటర్‌కి వస్తే, అతను ఏ సినిమా అయినా ఒకే అంచనాలతో చూస్తాడు. కాబట్టి సమానంగా చూడాలి'' అని అన్నారు. తన సినిమా ప్రేక్షకులను అలరిస్తోందని, సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోందని కూడా తెలిపారు.
అనంతరం హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కూడా ఈ విషయంపై స్పందించారు. 'ఒకవేళ సినిమా నిజంగా బాగా లేకపోతే నేను సక్సెస్ మీట్ పెట్టేవాడిని కాదు. నేను నటించిన 'ఎస్.ఆర్. కల్యాణమండపం' సమయంలో కూడా ఉదయం షోలకి తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ, సాయంత్రం షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. 'కె- ర్యాంప్' ఒక ప్రయోగాత్మక చిత్రం కాదని మేం ముందుగానే చెప్పాం. కానీ అయినా పాజిటివ్‌గా ప్రోత్సాహం ఇస్తారని అనుకున్నాం'అని అన్నారు.
రొమాంటిక్ అండ్ ఎంటర్టైనింగ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రేక్షకులు సపోర్ట్ ఇస్తే, చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. ఈ ఈవెంట్‌లో నిర్మాత రాజేశ్ దండా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. "చిన్న సినిమాలకు ఒక న్యాయం, పెద్ద సినిమాలకు వేరొక న్యాయం ఎందుకు?" అనే ఆయన ప్రశ్న సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











