Breaking : మోహన్ లాల్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డ్.. ఎనలేని శ్రమకు గుర్తింపుగా
మలయాళం స్టార్ హీరో, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ మోహన్ లాల్ చిత్ర పరిశ్రమలో 1978 నుంచి యాక్టివ్ ఉంటారు. దాదాపు 50 ఏళ్లుగా ఆయన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. కాగా ఆయన చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు చేస్తున్న కృషికి గానూ భారత ప్రభుత్వం గుర్తించింది. సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ తో ఆయనను సత్కరించబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతో మలయాళ స్టార్ మోహన్ లాల్ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగుతోంది.
తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023ని ప్రదానం చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇండియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టరీ తాజాగా ప్రకటించడం విశేషం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మోహన్ లాల్ కు ఈ అవార్డును ప్రకటించినట్టు I&B మినిస్టరీ వెల్లడించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ లాల్ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఎక్స్ ద్వారా పేర్కొంది.

ఇక మోహన్‌లాల్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
భారతీయ సినిమాకు ఆయన చేసిన అద్భుతమైన కృషికి గాను దిగ్గజ నటుడు, దర్శకుడు, నిర్మాతను ఈ అవార్డుతో సత్కరించబోతున్నామని తెలిపారు. అంతేకాకుండా మోహన్ లాల్ అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, నిర్విరామంగా చేస్తున్న కృషి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక చరిత్రను రాశాయని, ఆయన సినీ ప్రయాణం ఒక గోల్డెన్ జర్నీ అంటూ అభివర్ణించారు.
మోహన్ లాల్ కు ఈ ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా 23 సెప్టెంబర్ 2025న ఘన సత్కారంతో ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగబోయే ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మోహన్ లాల్ అవార్డును అందుకోబోతున్నారు. గతంలో చిత్ర పరిశ్రమ నుంచి లెజెండరీ సింగర్స్ లతా మంగేష్కర్, ఆశా బోస్లే, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ యష్ చోప్రా దాదా సాహెబ్ అవార్డ్ ను అందుకోవడం విశేషం.
మోహన్ లాల్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో 400 సినిమాల్లో నటించారు. మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, తెలుగు భాషల్లో నటించి దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. నటుడిగా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా, సింగర్ గానూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇక ఇప్పటికే మోహన్ లాల్ కు 2001లో పద్మశ్రీ అవార్డ్, 2019లో పద్మ భూషణ్ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం విశేషం. రీసెంట్ టైమ్స్ లో మోహన్ లాల్ ఎల్2: ఎంపురాన్, తుడురమ్, హృదయపూర్వం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో జనతా గ్యారేజీతో భారీ విజయాన్ని అందుకున్నారు. చివరిగా కన్నప్పలో కీలక పాత్రలో మెరిశారు.


Click it and Unblock the Notifications











