అఖిల్, సురేందర్ రెడ్డి మూవీలో మలయాళ సూపర్ స్టార్... ఎజెంట్‌లో పవర్‌ఫుల్ పాత్ర కోసం..
అక్కినేని వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని వచ్చిన అఖిల్ అక్కినేని వరుస ఫ్లాప్‌లతో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తన కుమారుడి కెరీర్‌ను చక్కబెట్టేందుకు నాగార్జున కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. అఖిల్, హల్లో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌పైనే అఖిల్ ఆశలు పెట్టుకొన్నాడు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆ చిత్రం కూడా థియేట్రికల్‌గా సాధ్యపడే అవకాశం లేకపోవడంతో ఆయన ఫోకస్ అంతా సురేందర్ రెడ్డి చిత్రంపైనే ఉంది.
స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రానున్న చిత్రంలో బాలీవుడ్‌కు చెందిన ఓ యువ హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, సురేందర్2 సినిమా బ్యానర్‌పై దర్శకుడు సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కాగా ప్లాన్ చేసిన ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేశారు.

అయితే అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చే ఏజెంట్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారనే వార్త మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాలోని ఓ పవర్‌పుల్ పాత్ర కోసం మమ్ముట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మమ్ముట్టి ఈ ప్రాజెక్టులోకి వచ్చే వార్తను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జీవితం ఆధారంగా దర్శకుడు మహీ రాఘవ్ తెరకెక్కించిన యాత్ర చిత్రంలో మమ్ముట్టి నటించిన విషయం తెలిసిందే. 2019 తర్వాత మళ్లీ మమ్ముట్టి తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు.
2020లో మమ్ముట్టి షైలాక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత వన్, ది ప్రీస్ట్ చిత్రా్లో నటించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మలయాళ చిత్రం భీష్మ పర్వం షూటింగ్ దశలో ఉంది.


Click it and Unblock the Notifications











