మొన్న సోనూ ఇప్పుడు చరణ్.. పాదయాత్రగా వచ్చిన అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్!
ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలను కలవడానికి ఎంత సాహసానికైనా ఒడిగడుతున్నారు.. కొద్ది రోజుల క్రితం తన అభిమాన నటుడు సోనూసూద్ ను కలవడం కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పాదయాత్ర చేసిన ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

ఏకంగా 240 కిమీ పాదయాత్ర
తమ అభిమాన హీరో రామ్ చరణ్ ను కలిసేందుకు తెలంగాణలో గద్వాల్ జిల్లా నుంచి ముగ్గురు రామ్ చరణ్ వీరాభిమానులు హైదరాబాద్ దాకా నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఏకంగా 240 కిలోమీటర్ల దూరం ఉండటం గమనార్హం. సంధ్య జయరాజ్, రవి, వీరేష్ అనే ముగ్గురు జూన్ 20వ తేదీన రామ్ చరణ్ ని కలిసి ఉద్దేశంతో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పాదయాత్ర ప్రారంభించారు.

ఇంటి అడ్రెస్ తెలియక
జూన్ 24వ తేదీకి హైదరాబాద్ చేరుకున్న వీరు రామ్ చరణ్ ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలియక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు చేరుకున్నారు. అయితే వీరు పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన విషయాన్ని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రామ్ చరణ్ దృష్టికి తీసుకువెళ్లగా రామ్ చరణ్ వారి అభిమానానికి పొంగిపోయాడు.. ఇంకేముంది వారందరినీ తన ఇంటికి ఆహ్వానించాడు.

హత్తుకుని
ఆ ముగ్గురూ రామ్ చరణ్ ఇంటికి వచ్చీ రావడంతోనే ముగ్గురినీ హత్తుకుని వారిని ఆనంద పరిచాడు. ఇంటికి పిలవడమే గొప్ప అని అభిమానులు భావిస్తున్న తరుణంలో అలా పిలవడమే కాక వారికి హగ్ కూడా ఇవ్వడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏకంగా ముగ్గురితో రామ్ చరణ్ ఒక గంట పాటు గడిపినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్
రామ్ చరణ్ ఆ ముగ్గురినీ హత్తుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గంట పాటు జరిగిన సంభాషణలలో వారు జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారు ? అనే విషయం తెలుసుకుని తన వంతు కృషి చేస్తానని రామ్ చరణ్ ముగ్గురు యువకులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే చరణ్ వారిని ఈ కరోనా సమయంలో కలవడం గొప్ప విషయమే కదూ.

సినిమాల విషయానికి వస్తే
ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ ప్రస్తుతానికి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు.. అలాగే తన తండ్రి చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాని నిర్మిస్తూనే అందులో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాల షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











