Mohan Babu University: మోహన్ బాబుకు భారీ షాక్.. యూనివర్సిటీ గుర్తింపు రద్దుకు సిఫార్సు! ఏం జరిగిందంటే
Mohan Babu University: టాలీవుడ్ సినీయర్ హీరో మంచు మోహన్ బాబు (Mohan Babu) కు భారీ షాక్ తగిలింది. తిరుపతి జిల్లా రంగంపేటలోని ప్రముఖ విద్యాసంస్థ మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీ (Mohan Babu University) కి భారీ జరిమానా పడింది. మోహన్‌బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ జరిమానా విధించింది. మోహన్ బాబు యూనివర్సిటీపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERC)చర్యలు తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ప్రముఖ విద్యాసంస్థ మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని సరైన విధంగా వెల్లడించకపోవడం వంటి అవకతవకల కారణంగా కమిషన్ యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించింది. అదనంగా విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.26.17 కోట్లు 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

2022-23 విద్యాసంవత్సరం నుంచి 2024 సెప్టెంబర్ వరకు విద్యార్థుల నుంచి నిర్ణీత రేటుకు మించి ఫీజులు వసూలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17న ఆదేశాలు జారీ చేసి, వాటిని తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. మూడు సంవత్సరాలుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తూ వస్తుండటంతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా కమిషన్ కఠిన చర్యలు తీసుకుంది.
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుల ప్రకారం, యూనివర్సిటీ కమిషన్ నిర్ణయించిన ఫీజులకు మించి ఫీజులు వసూలు చేయడంతో పాటు హాస్టల్‌లో ఉండని విద్యార్థుల నుంచీ మెస్ ఛార్జీలు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. బిల్డింగ్, ట్యూషన్, ల్యాబ్, ఇతర చార్జీల రూపంలో అదనపు మొత్తాలు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి, అలాగే యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్‌సీఏహెచ్‌పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ వంటి జాతీయ విద్యా నియంత్రణ సంస్థలకు కూడా సిఫార్సు చేసింది.
ఇక మోహన్ బాబు యూనివర్సిటీ తరఫున గత నెల 26న హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు మూడు వారాలపాటు తాత్కాలిక స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాల 2022లో మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీగా మారింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా మారిన తర్వాత కన్వీనర్ కోటాలో 35% సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. ఆ సీట్లకు ఫీజులు నిర్ణయించే హక్కు ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌కే ఉంది. కానీ ఆ నియమాలను ఉల్లంఘించి అదనపు ఫీజులు వసూలు చేసినట్లు తేలింది. ఈ పరిణామంతో మోహన్‌బాబు యూనివర్సిటీపై అవకతవకల మబ్బులు కమ్ముకున్నాయి. ఇక విషయం సినీ, రాజకీయ, విద్యా రంగంలో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











