బాహుబలికి ముందుగా ప్రభాస్ హీరో కాదా? రాజమౌళి మనసులో ఆ హీరోనా?
యంగ్ రెబల్ స్టార్‌గా ఉన్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారడానికి, ఆయన ఇమేజ్ ఎవరెస్ట్ స్థాయిలో నిలబడటానికి కారణం బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలలో అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్ తండ్రీ కొడుకులుగా నటించారు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే ప్రభాస్ ఈ చిత్రంతో తనలోని మరో కోణాన్ని బయటికి చూపించారు. ప్రభాస్ జీవితంతో పాటు భారతీయ సినిమాపైనే కీలకముద్ర వేసిన బాహుబలి పాత్రకు ప్రభాస్ కంటే ముందు మరో స్టార్ హీరోతో వేయించాలని రాజమౌళి అనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై బాహుబలి నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందించారు.
ఎవరెస్ట్ స్థాయిలో ప్రభాస్ క్రేజ్
బాహుబలి కోసం దాదాపు 5 ఏళ్ల సమయం కేటాయించిన ప్రభాస్.. ఈ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాలో భాగం కాలేదు. అన్నేళ్ల పాటు నిరీక్షణ, ఆయన కష్టానికి బాహుబలి రూపంలో విలువైన బహుమతి లభించి పాన్ ఇండియా స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ దేశంలోనే అత్యంత విలువైన నటుడిగా మారిపోయారు. ఆయన పేరు మీద వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. బాలీవుడ్ ఖాన్ త్రయం, ఇతర హిందీ స్టార్స్ కూడా ప్రభాస్‌తో పోటీపడలేకపోతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, ఆదిపురుష్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

నాన్న కోసమే బాహుబలి
బాహుబలి ప్రాజెక్ట్‌ను తాను అంగీకరించడానికి తన తండ్రి సూర్యనారాయణ రాజే కారణమని ప్రభాస్ చెప్పారు. తనని రాజులా వెండితెరపై చూడాలన్నది మా నాన్నగారి కల అని.. అందుకే రాజులు, యుద్ధాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి వెంటనే ఓకే చెప్పినట్లు ఆయన తెలిపారు. అయితే ప్రభాస్‌కి ఇంతటి క్రేజ్‌ని, టాలీవుడ్‌కి ఇంతటి పేరుని తీసుకొచ్చిన బాహుబలిలో తొలుత బాలీవుడ్ హీరో నటించాల్సి ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. బాహుబలి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఇందులోని బాహుబలి పాత్రకు ఎవరిని తీసుకుందామా అని రాజమౌళి పలువురు హీరోల పేర్లను పరిశీలించారట.
బాహుబలిగా తొలుత ఆ హీరో
ఈ లిస్ట్‌లో తొలుత వినిపించిన పేరు బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. ఆరడుగుల హైట్‌తో కండలు తిరిగిన దేహంతో, గ్రీకు వీరుడిలా కనిపించే హృతిక్ రోషన్ బాహుబలి పాత్రకు సరిగ్గా సరిపోతారని రాజమౌళి అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అప్పటికే జోధా అక్బర్ వంటి చారిత్ర సినిమాను చేసిన అనుభవం హృతిక్‌కు ఉండటం కూడా జక్కన్నను ఆయన వైపు మళ్లేలా చేసిందని అంటారు. అయితే ఈ ప్రచారంపై అప్పట్లోనే బాహుబలి నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందించారు.
ప్రభాస్ అంటే బాహుబలి
ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. ఈ ప్రచారానికి చెక్ పెట్టారు. తమ దృష్టిలో బాహుబలి అంటే ప్రభాస్ మాత్రమే అని తేల్చిచెప్పారు. ఈ పాత్ర కోసం హృతిక్ రోషన్‌నే కాదు.. ఏ ఇతర హీరోలని సంప్రదించలేదని శోభు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా బాహుబలి ది బిగిన్, బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలను కలిపి ఒకే భాగంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











