దిశా పటానీ ఇంటిపై కాల్పులు.. ఆ మాఫియా గ్యాంగ్ కుట్రనేనా?
బాలీవుడ్ నటీనటులకు మాఫియాలో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరో నటీనటులకు వాళ్లతో ఫ్రెండ్‌షిప్ ఉంది. అలాగే మాఫియా డాన్‌లు ఇచ్చే పార్టీలలో పాల్గొని సందడి చేసేవారు. అలాగే గ్యాంగ్‌స్టర్స్‌తో ప్రేమాయణాలు సాగించిన వారు కూడా ఉన్నారు. అదే గ్యాంగ్‌స్టర్ల చేతిలో చనిపోయిన వారు, వారి కారణంగా జైలుకు వెళ్లిన వారెందరో. అలాగే బాలీవుడ్ ప్రస్థానంలో అండర్ వరల్డ్‌ది విడదీయరాని పాత్ర. అయితే ఈ కాలంలోనూ మాఫియా వల్ల బాలీవుడ్ నటులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సల్మాన్‌ను వెంటాడుతోన్న బిష్ణోయ్ గ్యాంగ్
కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన కొన్నాళ్లు జైలులో ఉండటంతో పాటు కోర్టులలో విచారణకు సైతం హాజరయ్యారు. కేసు నుంచి బయటపడినా సల్మాన్ ఖాన్‌ను ప్రాణభయం వెంటాడుతోంది. దీనికి కారణం కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్. కృష్ణజింకలను దైవంలా, తమ పూర్వీకులే మళ్లీ జన్మించారు అన్నట్లుగా భావించి ఆరాధిస్తారు బిష్ణోయ్ తెగవాళ్లు.

నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తోన్న లారెన్స్
అలాంటి కృష్ణజింకలను వేటాడటంతో సల్మాన్‌పై ఈ తెగ కక్ష కట్టింది. ఈ తెగకే చెందిన లారెన్స్ బిష్ణోయ్.. సల్మాన్‌ను చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. సుపారీ హత్యలు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా వంటి నేరాలతో లారెన్స్ బిష్ణోయ్ తన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ముంబై పోలీసులను వణికిస్తూ.. జైళ్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచే తన గ్యాంగ్‌ని నడిపిస్తున్నాడు. సల్మాన్ ఇంటి వద్ద రెక్కీతో పాటు అతని ఇంటి వద్ద పలుమార్లు కాల్పుల ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి.
బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో కపిల్ శర్మ
ఇకపోతే కొద్దిరోజుల క్రితం ఇండియాలోని టాప్ స్టాండప్ కమెడియన్, హోస్ట్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫేపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రెండు సార్లు కాల్పులకు తెగబడటంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. తాము చెప్పినట్లు వినకుంటే ఈసారి ముంబైలో అంతు చూస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ కుటుంబాన్ని బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఉత్తరప్రదేశ్ బరేలీలోని దిశా ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు చోటు చేసుకున్నాయి. అందరూ గాఢ నిద్రలో ఉండగా కాల్పులు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు, అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భయాందోళనలో దిశా పటానీ ఫ్యామిలీ
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ ఇటీవల ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ గురు, ప్రేమానంద్ మహారాజ్‌ను అగౌరవపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు, మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించాడు. అలాగే మరో గ్యాంగ్‌స్టార్ రోహిత్ గోదారా కూడా ఈ కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. దీనిపై పోలీసులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. అయితే నేరుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పాత్ర బయటపడటంతో దిశా పటానీ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇకపోతే.. దిశా పటానీ ప్రస్తుతం వెలకమ్ టు జంగిల్, హోలీ గార్డ్స్ సాగాలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











