వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ వచ్చేస్తోంది
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ.. చిత్రాలంటే యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు విజయ్ నటించిన చిత్రాలన్నీ యూత్‌ను టార్గెట్ చేసినవే. అందులో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ అంతగా మెప్పించకపోయినా.. విజయ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
డియర్ కామ్రేడ్ చిత్రంతో దక్షిణాదిపై పట్టు సాధించేందుకు భారీ ప్లాన్ వేసిన విజయ్‌కు నిరాశే మిగిలింది. కోలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ ఇలా తేడా లేకుండా అన్నింటా తన హవాను కొనసాగించాలనుకున్న విజయ్.. తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో మరో క్రేజీ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేమికుల రోజున వచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, ఇసబెల్లా, రాశీ ఖన్నా, క్యాథరిన్ థ్రెస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరి పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ విజయ్ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించబోతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ టీజర్‌ను రేపు సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబోతోన్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కేఏ వల్లభ నిర్మిస్తుండగా.. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











