దక్షిణాది స్టార్స్ చెలరేగిపోవడానికి 3కారణాలట... కంగనా కౌంటర్
ఈ మధ్యకాలంలో తన మాటల తూటాలను పొదుపుగా వాడుతున్న కంగనా రనౌత్ ఉన్నట్లుండి తన వాగ్ధాటిని దక్షణాది ఇండస్ట్రీపై ఎక్కుపెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్లపై కాస్త గట్టిగానే అందుకుంది. అంటే మరో విధంగా అనుకునేరు. అమ్మడు మంచి మూడ్ లోనే ఉన్నట్లుంది. అందుకే మనోళ్లపై ప్రశంస వర్షం కురిపించేస్తూ తెగ మురిపించేస్తోంది.
ఈ మధ్య ఇన్స్టాలో మస్త్ యాక్టివ్ గా ఉంటోన్న కంగన ఉన్నట్లుండి దక్షిణాది చిత్రాల గురించి నాలుగు మంచి మాటలు రాసేసింది. దక్షిణాది సూపర్ స్టార్లు ఓ వెలుగు వెలిగిపోతున్నారు అంటే దాని వెనుక మూడు కారణాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. దక్షిణాది హీరోల్లో లోతుగా పాతుకుపోయిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలే ప్రధాన కారణం కాగా, కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమించడం రెండో కారణమని తెలిపింది. వారి సంబంధ భాంధవ్యాలు పాశ్చాత్య ధోరణలు కనిపించవని వెల్లడించింది. ఇక వృత్తిపట్ల వారి డెడికేషన్, ప్యాషన్ అసమాన్యమైనవని కొనియాడింది. అందుకే దక్షిణాది సూపర్ స్టార్ల ఖ్యాతి ఖండాంతరాలకు చేరుతోందని వ్యాఖ్యానించింది.

అయితే ఇంత చెప్పిన తరువాత కంగన స్టైల్ లో చిన్న కౌంటర్ ఇవ్వకపోతే ఎలా? అందుకే కొసమెరుపుగా దక్షిణాది వాళ్లు బాలీవుడ్ వల్ల కరప్ట్ అవ్వకూడదంటూ తనదైన స్టైల్ లో ఓ ఫినిషింగ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఏమైనా కంగనకు ముందు నుంచి దక్షిణాది పరిశ్రమపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉందనే చెప్పాలి. వీలు చిక్కినప్పుడల్లా టాలీవుడ్ పైనా ప్రశంసలు కురిపిస్తున్న కంగన, తలైవి సినిమా తరువాత మరింత ప్రేమను కురిపించేస్తోంది.
ఈ మధ్యకాలంలో దక్షిణాది సినిమాలు అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతున్న వైనం తెలిసిందే. ఇటీవలే పుష్ప -ది రైజ్ సినిమా భారీ సక్సెస్ అవ్వడంతో బాలీవుడ్ లోనూ దీనికి సీక్వెల్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ - చాప్టర్ 2 అనౌన్స్ డేట్ పై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కంగన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


Click it and Unblock the Notifications











